'ఓజీ' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో మహిళకు అరుదైన ఆపరేషన్

  • మెలకువగా ఉంచి ఆపరేషన్ చేసిన వైద్యులు
  • అభిమాన నటుడు పవన్ కల్యాణ్ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స
  • విజయవంతంగా మెదడులోని గడ్డను తొలగించిన డీవీసీ ఆసుప‌త్రి డాక్టర్లు
  • శరీర కదలికలను నియంత్రించే భాగం వద్ద ట్యూమర్ ఉండటంతో ఈ చికిత్స‌
గుంటూరు జిల్లాలో ఓ మహిళకు వైద్యులు వినూత్న పద్ధతిలో బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆమెకు ఇష్టమైన నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన సినిమా చూపిస్తూ, మెలకువగా ఉన్నప్పుడే మెదడులోని గడ్డను తొలగించి ప్రాణాలు కాపాడారు. వైద్య పరిభాషలో 'అవేక్ క్రేనియోటమీ'గా పిలిచే ఈ అరుదైన శస్త్రచికిత్స వడ్లమూడిలోని డీవీసీ ఆసుప‌త్రిలో జరిగింది.

ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గనిపిశెట్టి కోటేశ్వరమ్మ, తన భర్తతో కలిసి గుంటూరు జిల్లా పొన్నూరులో కిచిడీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఇటీవల మూర్ఛ రావడంతో కిందపడిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను వెంటనే వడ్లమూడిలోని డీవీసీ ఆసుప‌త్రికి తరలించారు. అక్కడ న్యూరో సర్జన్ డాక్టర్ పద్మనాభుని అరుణ్‌కుమార్ ఆమెకు ఎంఆర్‌ఐ స్కాన్‌తో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.

పరీక్షల అనంతరం కోటేశ్వరమ్మ మెదడులో గడ్డ (ట్యూమర్) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఆ గడ్డ మెదడులో అత్యంత కీలకమైన, శరీర కదలికలు, పనితీరును నియంత్రించే సున్నితమైన ప్రాంతానికి దగ్గరగా ఉందని తేలింది. సాధారణ పద్ధతిలో జనరల్ ఎనస్థీషియా (పూర్తి మత్తు) ఇచ్చి సర్జరీ చేస్తే నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు భావించారు. దాంతో ఆమె స్పృహలో ఉండగానే (లోకల్ ఎనస్థీషియా) శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించాలని నిర్ణయించారు.

ఆపరేషన్ సమయంలో రోగి భయపడకుండా ప్రశాంతంగా ఉండేందుకు వారికి ఇష్టమైన సినిమాను చూపించడం ఈ విధానంలో ఒక భాగం. కోటేశ్వరమ్మను తనకు ఇష్టమైన నటుడు ఎవరని అడగ్గా, ఆమె పవన్ అని చెప్పారు. దీంతో వైద్యులు ఆమెకు 'ఓజీ' సినిమాను చూపిస్తూ సర్జరీ ప్రారంభించారు. కోటేశ్వరమ్మ సినిమా చూస్తూ, వైద్యులతో మాట్లాడుతూ వారి సూచనలను పాటించారు. ఈ క్రమంలో డాక్టర్ల బృందం అత్యంత జాగ్రత్తగా, నాడీ వ్యవస్థకు ఎలాంటి హాని కలగకుండా మెదడులోని గడ్డను పూర్తిగా తొలగించింది.

న్యూరో సర్జన్ డాక్టర్ అరుణ్‌కుమార్, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ నేతృత్వంలోని బృందం ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేసింది. వైద్య బృందాన్ని డీవీసీ ఆసుప‌త్రి ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం కోటేశ్వరమ్మ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

Brain Surgery Guntur
Pawan Kalyan
OG Movie
Awake Craniotomy
DVC Hospital
Dr Padmanabhuni Arun Kumar
Ganipisetti Koteswaramma
Brain Tumor Removal
Guntur Medical News
Andhra Pradesh Health Updates

More Telugu News